Current Date: 25 Nov, 2024

ఏపీ హైకోర్టు కీలక తీర్పుతో విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికపై సందిగ్దత

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని ఉప ఎన్నికకు అభ్యర్ధిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే మండలి చైర్మన్ తనపై వేసిన అనర్హత వేటుపై ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా రఘురాజు‌పై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే అనర్హత పిటిషన్‌పై రఘురాజు వాదనలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం నేపథ్యంలో విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక ఆగిపోతుందా ..? ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Share