పాతికేళ్ల పాటు తనతో కలిసి ఉన్న స్నేహితుడి మరణంతో ఆ ఏనుగు కంటతడి పెట్టింది. చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. మీదపడి కన్నీరు పెడుతూ దాని దగ్గరికి ఎవరినీ రానివ్వలేదు. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో చోటుచేసుకుందీ ఘటన. సిబ్బంది ఈ దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఏనుగు కంటతడి చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లానే మూగ జంతువుల్లోనూ అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయని ఈ ఘటన చాటిచెబుతోందని కామెంట్లు పెడుతున్నారు. రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో రెండు ఏనుగులు వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. సర్కస్ సిబ్బంది వాటికి జెన్నీ, మాగ్డా అని పిలుచుకునేవారు. పాతిక సంవత్సరాలకు పైగా జెన్నీ, మాగ్డా అదే సర్కస్ లో కలిసి ఉన్నాయి. ఇటీవల అనారోగ్యంతో జెన్నీ మరణించింది. కాసేపటికి జెన్నీ దగ్గరికి వచ్చిన మాగ్డా.. తన తొండంతో జెన్నీని లేపేందుకు ప్రయత్నించింది. జెన్నీ కదలకపోవడంతో మీదపడి కన్నీరు పెట్టుకుంది.
Share