విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై ఎంపీ శ్రీభరత్ పూటకో మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన లిఖిత పూర్వక హామీని వీలైనంత త్వరగా నెరవేర్చాల్సిందిపోయి నాన్చుతూ వస్తున్నారు. కేంద్రంతో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు ‘మళ్లీ పోయి రావలె’ అంటూ ఢిల్లీ వెళ్లి వస్తున్నారు తప్పితే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్ర పెద్దలతో ప్రకటన చేయించలేకపోతున్నారు. తాజాగా విశాఖ టీడీపీ కార్యాలయంలో ఇసుక సమస్యపై మాట్లాడేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా శ్రీభరత్ ఏదేదో మాట్లాడారు. తాము సింగిల్‌గా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడగలిగే వాళ్లమని, కూటమితో ఉండడం వల్ల ఇబ్బందులొస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి విశాఖ ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో భరత్ ఓడిపోయారు. ఇప్పుడు కూటమితో జతకట్టబట్టే గెలిచారన్న విషయాన్ని మర్చిపోయారు. అంతేకాకుండా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు లక్షకు పైగా మెజార్టీ సాధించి, అందులో నుంచే శ్రీభరత్‌కు కూడా భారీ ఓట్లు పడ్డాయన్న విషయం మర్చిపోకూడదు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామన్న ఒకే ఒకే మాటకు ఆ ప్రాంత వాసులంతా కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించారు.
Share