Current Date: 26 Jun, 2026

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌కి.. ఇంగ్లాండ్‌తో స్పెషల్ ట్రీట్‌మెంట్!

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ, భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రత్యేక నిబంధనలు విధించింది. వైభవ్ వయసు 16 ఏళ్ల కంటే తక్కువగా ఉండటంతో, బ్రిటన్ చట్టాల ప్రకారం అతన్ని 'పసివాడిగానే' గుర్తిస్తూ సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఒకే డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడానికి అనుమతించలేదు. మ్యాచ్‌లు, టీమ్‌ మీటింగ్‌ల సమయంలో జట్టుతో ఉండొచ్చని, అయితే దుస్తులు మార్చుకునే సమయంలో మాత్రం అతను అక్కడ ఉండరాదని స్పష్టం చేస్తూ అతని కోసం ప్రత్యేకంగా మరో డ్రెస్సింగ్‌ రూమ్‌ను కేటాయించింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలను ఖచ్చితంగా పాటించాలనే రూల్ లేకపోయినప్పటికీ, ఈసీబీ తమ దేశంలోని బాలల భద్రతా చట్టాలు, 'సేఫ్‌ హ్యాండ్స్‌' విధానాన్ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ గనుక బరిలోకి దిగితే, సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. కేవలం 15 ఏళ్ల 91 రోజుల వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా రికార్డుకెక్కుతాడు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టగా, వైభవ్ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించబోతున్నాడు.