Current Date: 05 Oct, 2024

పోలీసులు చేసిన పనికి నారా లోకేష్ క్షమాపణలు

ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీపీఎం నేతలకి క్షమాపణలు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు జిల్లా సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌పై నారా లోకేష్ స్పందించారు. 'మమ్మల్ని మన్నించండి కామ్రేడ్.. సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను' అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Share