Current Date: 26 Nov, 2024

కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి.. ఆందోళన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 కెనడాలోని బ్రాంప్ట‌న్‌లో హిందూ ఆల‌యంలో భ‌క్తుల‌పై ఖ‌లిస్థానీ మ‌ద్ద‌తుదారులు దాడిఘ‌ట‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడాలో దాడులు, పొరుగు దేశాలలో హిందువులను వేధించడంపై ఆయ‌న ఎక్స్  వేదిక‌గా స్పందించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్ వంటి దేశాలలో మన హిందూ సోదరులు, సోదరీమణులు వేధింపులు, హింస, ఊహాతీతమైన బాధలకు గురికావ‌డం చాలా బాధ కలిగించింది. హిందువులకు సంఘీభావం ఎక్కడిది? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాం. కెనడా ప్రభుత్వం అక్కడ హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని, ఎక్కడైనా, ఏ సంఘమైనా హింసకు గురికాకుండా, అచంచలమైన సంకల్పంతో ఐక్యంగా నిలబడదామని జ‌న‌సేనాని త‌న‌ పోస్టులో పేర్కొన్నారు.

Share