Current Date: 08 Feb, 2026

ఢిల్లీలో పేదలకు వైద్యం నిరాకరణ..అపోలో ఆసుపత్రి భూములు వేలం

ఢిల్లీలోని ప్రముఖ అపోలో ఆసుపత్రి పేదలకు ఉచిత వైద్యం అందించడంలో నిరంతరం విఫలమవుతోందని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన కోటా ప్రకారం చికిత్స అందించడం లేదని, ఇది ఒప్పంద ఉల్లంఘన అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఆసుపత్రికి లీజును పొడిగించవద్దని, ఆ భూమిని, భవనాలను తిరిగి స్వాధీనం చేసుకుని కొత్తగా వేలం సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అపోలో ఆసుపత్రితో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందం 2018లోనే ముగిసిందని, అలాగే మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఉన్న భూమి లీజు ఒప్పందం జూలై 2023తోనే ముగిసిందని ఢిల్లీ ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ వత్సల అగర్వాల్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ లీజును పొడిగించడం ప్రజా ప్రయోజనాలకు, ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం వాదించింది. నిబంధనల ప్రకారం అపోలో ఆసుపత్రి 33% ఇన్‌పేషెంట్లకు, 40% అవుట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉండగా, కేవలం 7 నుంచి 10 శాతం మందికే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ తనిఖీలో తేలింది. పేదల నుంచి మందులు మరియు ఇతర ఖర్చుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ ఆసుపత్రి యాజమాన్యం తీరు మారకపోతే, దాని నిర్వహణను ఎయిమ్స్ కు అప్పగిస్తామని సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 19న జరగనుంది.