Current Date: 11 May, 2026

ఈ వారం రాయలసీమ, కోస్తాలో భారీ వర్షాలు.. అల్పపీడనం ఎఫెక్ట్

శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
దీనికి తోడు బిహార్ నుంచి కోస్తాంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే కొద్దిరోజులు వాతావరణం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. దీని ఫలితంగా గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. ఆదివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు కురిసినా, మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.