Current Date: 15 May, 2026

ఐపీఎల్‌లో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలపై నీళ్లుచల్లిన ముంబయి

ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ రేసు నుండి ఇప్పటికే నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ధర్మశాల వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన జస్‌ప్రీత్ బుమ్రా గెలుపుతో తన ప్రస్థానాన్ని ప్రారంభించగా, వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57) అర్ధశతకంతో రాణించగా, ఆఖర్లో అజ్మతుల్లా (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో పంజాబ్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచాడు. ఒక దశలో 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కింగ్స్‌ను లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (48) అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (33 బంతుల్లో 75 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో విరుచుకుపడిన తిలక్, చివరి ఓవర్లో వరుస సిక్సర్లు బాది 19.5 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు.