Current Date: 15 May, 2026

పెళ్లికొడుకు మారిపోయాడు.. బెడిసికొట్టిన ఇన్‌స్టా లవ్!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన పెళ్లి మంటపాన్ని రణరంగంగా మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. వివాహానికి సిద్ధమైన ఒక యువతి, తీరా మంటపంలో పెళ్లికొడుకును చూడగానే ఒక్కసారిగా షాక్‌కు గురైంది. "నేను ఆన్‌లైన్‌లో మాట్లాడింది, ప్రేమించింది ఇతడిని కాదు" అంటూ ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి.న్యాయవాదిగా పనిచేస్తున్న సదరు యువతి, ఇన్‌స్టాగ్రామ్‌లో 'రాహుల్' అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఫోన్లలో మాట్లాడుకుంటూ వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో పెద్దలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే బారాత్ వధువు ఇంటికి చేరుకున్న సమయంలో అసలు విషయం బయటపడింది. ఎదురుగా ఉన్న దేవేంద్రసింగ్ అనే వ్యక్తి తన ప్రియుడు కాదని వధువు అభ్యంతరం తెలపడంతో పెళ్లి నిలిచిపోయింది.  ఈ వివాదం ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పెళ్లికొడుకు దేవేంద్రసింగ్ గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం చేసింది తానేనని అతడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.