సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఓ కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన ఆయన, గత 25 రోజుల్లో 11 కిలోల బరువు తగ్గడమే కాకుండా కండరాల క్షీణత కూడా ప్రారంభమైందని చెప్పారు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని పేర్కొన్న ఆయన, లాఠీఛార్జీలు, రాళ్లదాడి వంటి తీవ్రమైన ఉసిగొల్పే చర్యలు ఎదురైనప్పటికీ ఏమాత్రం సహనం కోల్పోకుండా ప్రశాంతంగా పోరాడిన విద్యార్థుల నిబ్బరానికి, ఆత్మసంయమనానికి సలాం చేస్తున్నట్లు తెలిపారు.
తన ఆందోళనను విరమించాల్సిందిగా అధికార పక్షానికి చెందిన కేంద్ర మంత్రులు, దాదాపు 65 మంది ఎంపీలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారని వాంగ్‌చుక్ వెల్లడించారు. దేశానికి సేవ చేయడానికి, తన సేవలను పునఃప్రారంభించడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అయితే, తన నిరాహార దీక్షను ముగించడానికి ముందు ప్రభుత్వం ముందు రెండు స్పష్టమైన షరతులను ఆయన ఉంచారు.
ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై ప్రభుత్వం ఎలాంటి పోలీసు బలప్రయోగం చేయకూడదని, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు, అక్రమ కేసులు లేదా చట్టపరమైన చర్యల పేరుతో ఎలాంటి వేధింపులకు గురిచేయబోమని ఖచ్చితమైన హామీ ఇవ్వాలని వాంగ్‌చుక్ కోరారు. ప్రభుత్వం నుంచి ఈ హామీ లభిస్తే, తనకు విజ్ఞప్తి చేసిన నాయకులు, ప్రజల పట్ల గౌరవంతో ఈ రోజే దీక్షను విరమిస్తానని, లేనిపక్షంలో తన పోరాటాన్ని దురదృష్టవశాత్తూ కొనసాగించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.