కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. ఆమె విదేశీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయం నుంచి నైమిషా మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీ పూర్తి చేశారు. నీట్ పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో విపక్షాలు, విద్యార్థి సంఘాలు విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆమె విదేశాల్లో చదువుతున్న విషయం బయటికి వచ్చింది. దేశ విద్యావ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రి కుమార్తె విదేశాల్లో చదవడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో పాటు ఆమె చదివిన యూనివర్సిటీ పేజీల్లోనూ కామెంట్లు చేశారు.
ఈ పరిణామం విస్తృత చర్చకు దారితీసింది. ప్రభుత్వ విధానాలు, ప్రజాప్రతినిధులపై విమర్శలు చేయడం సమంజసమే అయినప్పటికీ, అధికారిక నిర్ణయాల్లో ఎలాంటి భాగస్వామ్యం లేని బంధువులను ఇంటర్నెట్‌లో వేధించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.