కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కథ ఏంటంటే.. పెళ్లి పీటలపై ప్రియుడు మోసం చేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లి, మందుకు బానిసైన నివి (శ్రీ గౌరీ ప్రియ) జీవితంలోకి స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు అడుగుపెడతాడు. అతని సాహచర్యంతో నివి బ్రేకప్ బాధ నుంచి బయటపడి మళ్లీ ప్రేమలో పడుతుంది. అయితే ఆ తర్వాత వారి జీవితంలో ఎదురైన సవాళ్లు, పాత ప్రియుడు తిరిగి రావడం వల్ల జరిగిన పరిణామాల సమాహారమే ఈ చిత్రం కథ.
ఫస్ట్ హాఫ్ కథనం ఎంతో ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా సాగుతుంది. ప్రేమలో విఫలమైన హీరోయిన్ కోణం నుంచి కథను ఆరంభించడం, ఆపై కిరణ్ అబ్బవరం పాత్ర ప్రవేశంతో వినోదం, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి దర్శకుడు లాజిక్ పక్కనబెట్టి ఫాంటసీ, ఆత్మ కోణంలో కథను తీసుకెళ్లడం కన్విన్సింగ్‌గా అనిపించదు. క్లైమాక్స్, ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు ఊహకు అందేలా ఉన్నప్పటికీ, కొన్ని కామెడీ సీక్వెన్సెస్ పర్వాలేదనిపిస్తాయి.
నటీనటుల విషయానికొస్తే స్టీవెన్‌గా కిరణ్ అబ్బవరం సహజ సిద్ధమైన నటనతో మెప్పించగా, దేవదాసులా మారిన యువతిగా శ్రీ గౌరీ ప్రియ తన భావోద్వేగ నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రధమార్ధంలో ఉన్న భావోద్వేగాలు, సంగీతం మెప్పించినప్పటికీ.. ఊహకందేలా సాగే సెకండాఫ్ కథనం వల్ల ఈ చిత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. ఓవరాల్‌గా సినిమాను ఒక్కసారి చూడొచ్చు.