కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న 'విశ్వాస్ జ్యూవెలర్స్'లో అత్యంత విచిత్రమైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. షాప్‌లో భద్రపరిచిన దాదాపు 10 లక్షల రూపాయల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు ఉన్నట్టుండి మాయమయ్యాయి. ఇందులో 10 డైమండ్ ఉంగరాలు, 2 బంగారు గొలుసులు ఉన్నాయి. అయితే విచిత్రమేమిటంటే.. షాప్ తాళాలు అలాగే ఉన్నాయి, ఎలాంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు కానీ, దొంగలు చొరబడిన దాఖలాలు కానీ లేకపోవడంతో షాప్ యజమాని తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దీంతో అసలు విషయం తెలుసుకోవడానికి యజమాని షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో దృశ్యాలు చూసి షాప్ సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. ఓ ఎలుక షాప్‌లోకి చొరబడి ప్రదర్శనగా ఉంచిన డైమండ్ ఉంగరాలు, నగల కేస్‌ల నుంచి నగలని నోటితో కరుచుకుని తన బొరియలోకి ఈడ్చుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ విచిత్రమైన దొంగతనం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఎలుక వెళ్లిపోయిన బొరియను గుర్తించిన సిబ్బంది, దాన్ని తవ్వడం ప్రారంభించారు. చివరకు ఆ బొరియలో ఎలుక దాచిపెట్టిన 10 డైమండ్ ఉంగరాలు, 2 గొలుసులను సురక్షితంగా బయటకు తీశారు. రూ.10 లక్షల విలువైన ఆభరణాలన్నీ రికవరీ కావడంతో షాప్ యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ 'దొంగ ఎలుక'కు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.