Current Date: 05 Oct, 2024

చందనోత్సవానికి అంతా సిద్ధం మరి కొన్ని గంటల్లో అప్పన్న నిజరూప దర్శనం

భక్త కోటి ఎంతో ఆర్తితో ఎదురుచూస్తున్న శుభగడియ వచ్చేసింది. ఏడాది పొడవునా శ్రీ గంధపు మైపోతలో ఉండి ఒక్కనాడు మాత్రమే భక్తులకు అందించే తన నిజరూప దర్శనానికి సింహాద్రి నాథుడు సైతం అంతే ఆత్రంతో సంసిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మూడు రోజులుగా గంధం లేపనాన్ని విసర్జించేందుకు వీలుగా స్వామివారు జలాభిషేకాన్ని స్వీకరిస్తున్నారు. వైశాఖ శుద్ధ తదియ పర్వదినం సందర్భంగా నరహరి నిజరూప దర్శన భాగ్యం శుక్రవారం భక్తులకు కలగనుంది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత సుప్రభాత సేవతో అర్చకులు స్వామివారిని మేల్కొలుపుతారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి విష్వక్సేన ఆరాధన,పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం,పంచకలశ ఆవాహన చేస్తారు. ఒక వైపు ఘంటానాదం జరుగుతుండగా పండితులు చతుర్వేదాలు పారాయణ చేస్తుండగా అర్చక పెద్దలు అంతరాలయంలోకి ప్రవేశించి వెండి బొరిగెలతో  శ్రీగంధాన్ని పొత్తి వస్త్రాన్ని అత్యంత సున్నితంగా తొలగించి వరాహ నారసింహుడిని నిజరూపంలోకి తీసుకువస్తారు. వరాహ వదనంతో మానవ శరీరంతో సింహవాలంతో దర్శనమిచ్చిన స్వామివారికి తిరుమంజనం చేస్తారు. పట్టువస్త్రాలతో పాటు శిరస్సు, హృదయం పైన సుగంధభరిత పచ్చి గంధం ముద్దలను అలంకరిస్తారు. అనంతరం ఆరాధన చేసి శీతలం, వడపప్పు, ఫలాలను అరగింపు చేసి, మంగళాశాసనం పూర్తిచేస్తారు. ఆలయంలో పూర్వాచారాన్ని అనుసరించి వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన పూసపాటి వంశీయులు శ్రీగంధం చెక్క,పట్టు వస్త్రాలు సమర్పించగా అధికారులు,అర్చకులు వీరికి తొలి దర్శనభాగ్యాన్ని కల్పించడంతో చందనయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారి ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

సహస్ర ఘటాభిషేకానికి చినజీయర్‌ స్వామి రాక..
చందనోత్సవం లో భాగంగా శుక్రవారం రాత్రి జరగనున్న సహస్ర ఘటాభిషేకం వేడుకకు శ్రీవైష్ణవ సంప్రదాయ ఆచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి హాజరుకానున్నారు. ఈయనతో పాటు మూడు వందల మంది శ్రీ వైష్ణవ స్వాములు గంగాధర నుండి ప్రకృతి జలధారను కదవలతో తీసుకువచ్చి సహస్ర ఘటాభిషేకం జరిపించనున్నారు.

సిద్ధమైన శ్రీగంధం, పొత్తి వస్త్రం..! 
నిజరూప దర్శనం అనంతరం వరాహ నరసింహుడి కి సమర్పించే శ్రీగంధం సిద్ధమైంది. ఉద్యోగులు, భక్తులు ఎంతో శ్రమించి భక్తిశ్రద్ధలతో 32 కిలోల చందనం చెక్కలను అరగదీసి సేకరించిన సుమారు 120 కిలోల పచ్చి గంధంలో వైదిక పెద్దలు సుగంధ ద్రవ్యాలను కలిపి సిద్ధం చేసారు. పొత్తి వస్త్రం తో కలిపి స్వామివారికి సమర్పించనున్నారు. అంతకు ముందు స్వామివారు నిజరూపం లోకి వచ్చిన తరువాత తొలుత సమర్పించనున్న శ్రీగంధం ముద్దలను కూడా సుగంధ ద్రవ్యాలను కలిపి వైదిక పెద్దలు సిద్ధం చేశారు.

దేవస్థానం విస్తృత ఏర్పాట్లు..
స్వామివారి నిజరూప దర్శనానికి దేశ విదేశాల నుండి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో సింహాచలం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. గత ఏడాది ఉత్సవ నిర్వహణలో విఫలమైన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్వయంగా ఉత్సవ నిర్వహణ పై సమీక్ష నిర్వహించారంటే పరిస్థితులు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సాధారణ భక్తుడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనంతో పాటు 300, 1000, 1500 రూపాయల టిక్కెట్లను వారంరోజుల ముందునుండి అన్‌ లైన్‌, బ్యాంకుల్లో విక్రయించారు. ఏక కాలంలో సుమారు 29 వేల 500 మంది భక్తులకు సరపడా క్యూలు ఏర్పాటు చేసారు. నాలుగు లైన్లు నీలాద్రి గుమ్మం వరకు వేసారు. నాలుగు లైన్లలో భక్తులు ఒకే సమయంలో స్వామివారి దర్శనం చేసుకునేలా ర్యాంపు ఏర్పాటు చేసారు. పరిమిత సంఖ్యలో అతి ముఖ్యమైన ప్రముఖుల వాహనాలు తప్ప మిగిలిన వాహనాలన్నీ కొండ దిగువనే నిలిపివేస్తున్నారు. ఇందుకోసం కృష్ణాపురంలోని దేవస్ధానం గోశాల, సింహగిరి రెండవ ఘాట్‌ రోడ్డు, గురుకుల పాఠాశాల, పాత అడివివరం కూడలి, దేవస్ధానం పాత గోశాల కూడళ్ళు , బాలాజీ నగర్‌ లో కొత్తగా నిర్మిస్తున్న కళ్యాణ మండపాల వద్ద పార్కింగ్‌ కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతాల నుండే భక్తులను బస్సుల్లో సింహగిరికీ చేర్చేలా సన్నాహాలు చేశారు. అన్నీ పార్కింగ్‌ కేంద్రాల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీరు, నీడ ఏర్పాటు చేసారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని కొండపైన భక్తులు నడిచే ప్రాంతాల్లో రోడ్డుకు కూల్‌ పెయింట్‌ వేసారు. వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసారు. అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను మహా విశాఖ నగరపాలక సంస్థ తీసుకుంది. ఇందుకు అయ్యే ఖర్చును దేవస్ధానం భరించనుంది.