ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోందని... విధ్యంస పాలన చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్... ఆయన సొంత శాఖ అధికారులు ఆధ్యాత్మిక స్థలాలను కూలుస్తున్నా స్పందించడం లేదని, నోరు మెదపడం లేదని విమర్శించారు. ఆధ్యాత్మిక స్థలాల కూల్చివేతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. ఈరోజు కాశినాయని క్షేత్రానికి తాను వచ్చానని... ఈ క్షేత్రంపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఉండలేక వచ్చానని శ్యామల తెలిపారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పుకునే పిఠాపురం పీఠాధిపతి పవన్ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు రాజకీయపరమైనవి కావని... ఒక సామాన్య వ్యక్తిగానే తాను స్పందిస్తున్నానని తెలిపారు.
Share