ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సేవల్లో ఇటీవల చోటుచేసుకున్న అంతరాయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీసింది. తాజాగా మరోసారి మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగింది. ఈసారి మైక్రోసాఫ్ట్ కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ వేదిక అజ్యూర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. మొదట యూరప్ లో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోని వారు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అజ్యూర్ సేవలకు అంతరాయం కలగడంతో భారీ ఎత్తున యూజర్లు ఆందోళన చెందారు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ఓ వెబ్ సైట్ వెల్లడించింది. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. తమ ఇంజినీరింగ్ బృందాలు సమస్యను గుర్తించేందుకు శ్రమిస్తున్నాయని వెల్లడించింది.