ఏటా జరిగే తంతే అయినా మొన్నటి గిరి ప్రదక్షిణలో భక్తులు నరకం చూశారు. హనుమంతవాక, వెంకజీపాలెం, కైలాసాగిరి, మద్దిలపాలెం ప్రాంతాల్లో తోపులాట జరిగిందంటే పోలీసుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో భక్తుల అపసోపాల్ని చూపించారు. లెక్కకు మించి జనం రావడం వల్లే ఇలా అయిందంటూ పోలీసులు చెబుతున్న తీరు ఆక్షేపనీయంగా ఉంది. ఆరు లక్షలకు పైబడి జనం వస్తారని ముందునుంచే నేతలు, అధికారులు చెబుతూ వచ్చారు. మరి అలాంటప్పుడు ఆ మేరకు ఏర్పాట్లేవీ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తO చేయడం చూశాం. అప్పన్న దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదని సరిపెట్టుకున్నా పోలీసుల వైఖరిపై మాత్రం ఇప్పటికీ జనం నిందిస్తూనే ఉన్నారు. బుధ, గురువారాల్లో జరిగిన సమీక్షలో సరిగ్గా ఇదే అంశంపై అటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇటు హోంమంత్రి అనిత నగర పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ పోస్టుమార్టo ముగిసినా పోలీసుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని అనిపిస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్నారంటూ మళ్లీ విశాఖ జనానికి షాక్ ఇచ్చేలా పోలీసులు ఆంక్షలు విధించడం గమనార్హం. అర్జెంట్ ప్రెస్ మీట్ అంటూ విశాఖ సీపీ గురువారం రాత్రి మీడియాతో మాట్లాడడంపైనా జనం విసుక్కుంటునున్నారు. భోగాపురంలో ప్రధాని సభ అయితే ఇక్కడ ఆంక్షలేంటంటూ మండిపడుతున్నారు. ఆగస్టు 1న ఉదయం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నగరంలోనికి వాహనాల అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటించడం దారుణం. సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా ఇలా ప్రతిసారీ వాహనదారులకు ఈ పరీక్ష ఏంటంటూ ఆగ్రహం వ్యక్తo చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు అపొద్దని, అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావద్దని ఆదేశిoచడంపై గుర్రుమంటున్నారు. విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లే కూలీలు, నగరంలోకి రావాల్సిన వ్యాపారులు, ఉద్యోగస్తులు ఇలా రెండు మూడ్రోజులకోసారి పోలీసులు ఆంక్షలు విధిస్తే తామేమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్రా సమీప ప్రాంతాల నుంచి విద్య, వైద్యం కోసం వేలాది మంది నిత్యం విశాఖకు వస్తుంటారు. అలాంటప్పుడు శివార్ల నుంచి నగరం లోపలకు అనుమతి లేదంటే ఎవరైనా ఏమైపోవాలో పోలీసులు చెప్పడం లేదు. పోనీ ప్రధాని సభ ఉంది కాబట్టి శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించేస్తే సరిపోద్దిగా అంటూ సూచిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.