తెలుగు వారిపై నోరుజారిన కేసులో అరెస్టయిన నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. తెలుగు వారు అంతపురంలో సేవలు చేసేందుకు మాత్రమే తమిళనాడుకి వచ్చారంటూ చాలా చులకన చేస్తూ కస్తూరి మాట్లాడింది. దాంతో ఆమెపై చెన్నైలో కేసులు నమోదవగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సమన్లు ఇవ్వడానికి కస్తూరి ఇంటికి వెళ్లగా ఆమె పరారైంది. హైదరాబాద్‌లో తలదాచుకున్న కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చెన్నైకి తీసుకొచ్చి ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి రఘుపతి ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో పుళల్ జైలుకి తరలించారు. ‘నేను పరారిలో లేను. ఎక్కడికి పారిపోలేదు. ఎలాంటి భయం లేదు. హైదరాబాద్‌లో నా ఇంట్లోనే ఉన్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. రోజూ షూటింగ్‌కి వెళ్లి ఇంటికి వస్తున్నాను. నా వద్ద నా సెల్‌ఫోన్ లేదు, న్యాయవాదికి ఇచ్చాను. పోలీసులకి పూర్తిగా సహకరిస్తాను’ అని అరెస్ట్‌కి ముందు కస్తూరి వీడియో రిలీజ్ చేయడం గమనార్హం.
Share