పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' (మార్చి 26 విడుదల) తర్వాత పవన్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా 'ఫౌజీ' ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయిల్‌ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇమాన్వీకి పాకిస్థాన్ మూలాలు ఉన్నాయనే ప్రచారంతో కొందరు ఆమె ఎంపికను తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా ఆమెపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇమాన్వీ స్పందిస్తూ తాను పాకిస్థానీని కాదని, భారతీయ అమెరికన్ అని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, తనకు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె గతంలోనే వివరణ ఇచ్చారు. భారతీయ సంస్కృతి తన రక్తంలోనే ఉందని, హిందీతో పాటు తెలుగు, గుజరాతీ భాషలు కూడా మాట్లాడగలనని ఇమాన్వీ పేర్కొన్నారు. లాస్ ఏంజెలిస్‌లో పుట్టి పెరిగిన తాను, సినిమాలపై ఆసక్తితోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని ఆమె తెలిపారు. పవన్ సినిమాలో హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఇమాన్వీ పేరు వినిపించడంతో ఆమె నేపథ్యంపై మరోసారి నెట్టింట వాదోపవాదాలు జరుగుతున్నాయి.
Share