తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ విభేదాలు ఒక కొలిక్కి వచ్చాయి. వీరిద్దరి మధ్య గతంలో రెండు సార్లు గొడవ జరగడం వల్ల నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇకపై ఎంపీ వర్గంతో తనకు ఎలాంటి వివాదాలు ఉండబోవని కొలికపూడి స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసిన ఎమ్మెల్యే, ఇటీవలి పరిణామాలపై వివరణ ఇచ్చారు. ఎంపీతో రెండు సార్లు గొడవ పడటం, బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పల్లా గట్టిగా హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, గతం గతః అని, పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. మర్యాదపూర్వక రాజకీయం కొనసాగిస్తానని చెబుతూనే, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యేగా తన బాధ్యతలను స్వేచ్ఛగా నిర్వహించుకునేలా చూడాలని కొలికపూడి కోరారు. ఇకపై ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ నిర్ణయంతో తిరువూరు టీడీపీలో నెలకొన్న వర్గపోరుకు తాత్కాలికంగా తెరపడినట్లయింది.
Share