తెలుగు చిత్రసీమలో మరో మెగా వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ సమీపంలోని కొల్లూరులో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శిరీష్ నయనిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వేడుక రాజకీయ మరియు సినీ రంగ ప్రముఖుల కలయికతో కళకళలాడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దంపతులు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు వెంకటేశ్, సూర్య, కల్యాణ్ రామ్, రాశీఖన్నా వంటి తారలు సందడి చేశారు. మరో విశేషమేమిటంటే, ఈ పెళ్లి జరిగిన రోజే (మార్చి 6) తన సోదరుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం కావడం అల్లు కుటుంబంలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. మార్చి 6న పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్, స్నేహా రెడ్డి హ్యాపీగా ఉంటుండటంతో.. సెంటిమెంట్‌గా అదే రోజున పెళ్లి తేదీగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇకపై అన్నదమ్ములు ఇద్దరూ ఒకే రోజున యానివర్స్‌డేను జరుపుకోనున్నారు.
Share