Current Date: 08 Mar, 2026

టీమిండియాకు తలనొప్పిగా మారిన అభిషేక్.. ఫైనల్‌లో ఆడిస్తారా?

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు ఫైనల్‌కు చేరినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ అతిపెద్ద తలనొప్పిగా మారింది. పసికూన జింబాబ్వేపై చేసిన ఒక్క అర్థశతకం (55) మినహాయిస్తే, మిగతా 6 మ్యాచ్‌ల్లో అతను 0, 0, 0, 15, 10, 9 పరుగులకే పరిమితమై దారుణంగా విఫలమయ్యాడు. భారీ హిట్టర్‌గా జట్టుకు బలం అవుతాడనుకుంటే, వరుసగా తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతూ బలహీనంగా మారిపోయాడు. ప్రత్యర్థి జట్లు అభిషేక్ బలహీనతను పక్కాగా వాడుకుంటున్నాయి. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్పిన్నర్లను దించి, బంతి వేగాన్ని తగ్గించి లెగ్ సైడ్ స్పిన్ చేస్తూ అతణ్ని బోల్తా కొట్టిస్తున్నాయి. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో షాట్లు ఆడలేక ఇబ్బంది పడుతున్న అభిషేక్, చివరకు మిడ్ వికెట్ లేదా లాంగాన్ వైపు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోలేకపోవడంతో అతణ్ని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అభిషేక్ స్థానంలో రింకూ సింగ్‌ను తీసుకోవాలనుకున్నా, రింకూ కూడా ఫామ్‌లో లేకపోవడం మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందిగా మారింది. అభిషేక్ ఒక్కసారి కుదురుకుంటే నిమిషాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడని అందరికీ తెలుసు. మరి న్యూజిలాండ్‌తో ఆదివారం కీలకమైన ఫైనల్ పోరులోనైనా తన లోపాలను అధిగమించి, తన మార్కు మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందిస్తాడో లేదో వేచి చూడాలి.