అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందంటే ఇదే ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు.. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లేందుకు అక్కడే ఉన్న ఓ అంబులెన్స్‌ను దొంగతనంగా వేసుకెళ్లాడు. కానీ.. ఆశించినట్లుగా ఆ వ్యక్తి ఇంటికి చేరుకోలేదు. బ్యాడ్‌లక్ వెంటాడటంతో నిమిషాల వ్యవధిలో ఆ అంబులెన్స్ కొట్టేసిన ఆస్పత్రికే మళ్లీ వచ్చి పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో ఇంటికి వెళ్తున్న యువకుడు.. ఆ వాహనాన్ని అదుపు చేయలేక యాక్సిడెంట్‌కి గురయ్యాడు. దాంతో స్థానికులు 108కి ఫోన్ చేయడంతో ఇంకో అంబులెన్స్ వచ్చి గాయాలతో ఉన్న వ్యక్తిని మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఎందుకు అంబులెన్స్‌ను కొట్టేశావ్? అని ఆరా తీయగా ఆశ్చర్యపోయే విషయాలు చెప్పాడు. తాను మట్టి పనితో పాటు ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తానని.. ఆరోగ్యం బాలేక ఆస్పత్రికి వచ్చానని తెలిపాడు. సరదాగా అంబులెన్స్ డోర్ తీస్తే వచ్చిందని తాళం అలానే బండికి ఉండటంతో ఇంటికి వేసుకెళ్లానని తాపీగా చెప్పాడు. దాంతో వైద్య సిబ్బందికి నవ్వాలో ఏడవాలో అర్థంకాలేదు.
Share