Current Date: 18 Mar, 2026

పవన్‌ 'ఉస్తాద్'‌కు టికెట్ రేట్ల పెంపుకి నో.. ఫ్యాన్స్ హ్యాపీ!

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించి నైజాం ఏరియాలో టికెట్ ధరల పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సాధారణంగా భారీ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచుకోవడం పరిపాటిగా మారిన క్రమంలో, ఈ సినిమా కోసం కూడా నిర్మాతలు తొలుత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నెలకొన్న న్యాయపరమైన గందరగోళం, ఇతర పెద్ద సినిమాల విడుదలలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మైత్రీ మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాల విషయంలో రేట్ల పెంపుపై ఆఖరి నిమిషంలో తలెత్తిన చికాకులు, విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిర్మాతల ఈ నిర్ణయం పవన్ కల్యాణ్ అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు పెద్ద ఊరటనిచ్చింది. ధరలు అందుబాటులో ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం పెరగడమే కాకుండా, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రిపీట్ ఆడియన్స్ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.