పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య గత మూడు వారాలుగా కొనసాగుతున్న 'బహిరంగ యుద్ధం' తాజా వైమానిక దాడులతో అత్యంత భీకరస్థాయికి చేరుకుంది. సోమవారం రాత్రి కాబుల్‌లోని 2,000 పడకల సామర్థ్యం కలిగిన 'ఒమిడ్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్' లక్ష్యంగా పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు 400 మంది మరణించారని, మరో 250 మందికి పైగా గాయపడ్డారని అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తూ.. పాకిస్థాన్ సైన్యం ఇజ్రాయెల్ తరహా వ్యూహాలతో సామాన్య పౌరులు, ఆస్పత్రులపై దాడులు చేస్తోందని మండిపడింది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. తాము కేవలం అఫ్గాన్ తాలిబన్లకు చెందిన సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, మందుగుండు సామగ్రి నిల్వలను మాత్రమే లక్ష్యం చేసుకున్నామని, పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఈ సరిహద్దు పోరులో ఇప్పటివరకు వందలాది మంది మరణించగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా, తమ సార్వభౌమాధికారాన్ని పాక్ ఉల్లంఘిస్తోందని కాబుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.