ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు స్పీకర్ పదవి ఇచ్చి నా నోటికి ప్లాస్టర్ వేశారని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం రాత్రి నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఎన్నికై, స్పీకర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అయ్యన్నపాత్రుడు కు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు పెట్టిన రాజకీయ భిక్ష తను పొందిన పదవులు అని అన్నారు. 25 సంవత్సరాల వయసులో రాజకీయాలకు వచ్చాను. 42 సంవత్సరాలుగా అంచ లంచలుగా ఎదుగుతూ వచ్చాను. ఎవరికి రాని అదృష్టం నాది. పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా .ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఒకసారి ఎంపీగా గెలచా. ఇవన్నీ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే. రాజకీయం జూదం గా మారింది. విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా బాడీ లాంగ్వేజ్ కి స్పీకర్ కుర్చీకి సరిపోతుందో లేదో నాకు తెలియదు. అయినా రాజ్యాంగ పదవి ని బాధ్యతతో నిర్వహిస్తా. అసెంబ్లీని సక్రమంగా నిర్వహిస్తా. గత ప్రభుత్వ పాలన లో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సి ఉంది. రాష్ట్రానికి అప్పులు, వడ్డీలు ఎక్కువగా ఉన్నాయి.