Current Date: 26 Nov, 2024

High Court is serious about Adani port workers.. immediately to work!

విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 12 నుంచి చేస్తున్న సమ్మెకి ఏపీ హైకోర్టు చెక్ పెట్టింది. నిరవధిక సమ్మె కారణంగా విశాఖ స్టీల్‌ప్లాంటుకు బొగ్గు, లైమ్‌స్టోన్‌ నిలిచిపోయాయని.. దాంతో తీవ్ర నష్టాలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున తక్షణం కార్మికులు విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. సమస్యల పరిష్కారానికి పోర్టు యాజమాన్యం ఇటు నిర్వాసిత కార్మికులతోను, అటు రెగ్యులర్‌ కార్మికులతోను చర్చలు జరిపి, వారి డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. ఈ కేసుని తిరిగి జూన్‌ 24న విచారిస్తామని పేర్కొంది.

దాదాపు మూడు వారాలకిపైగా కార్మికుల మెరుపు సమ్మెతో ఆపరేషన్లు ఆగిపోయాయి. స్టీల్‌ప్లాంటుకు కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా రావలసిన ముడి పదార్థాలన్నీ ఆగిపోయాయి. సమస్యల పరిష్కారానికి అధికారులు పలు ప్రయత్నాలు చేసినా ఎటువంటి పురోగతి లేకపోవడంతో విశాఖ ఉక్కు అధికారుల సంఘం తరపున ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.

ఏప్రిల్‌ 19 నుంచి మే 3వ తేదీ వరకు ఎనిమిది వాయిదాల్లో అందరి వాదనలు విన్న తరువాత స్టీల్‌ప్లాంటును పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని, ప్లాంటు జాతీయ సంపద అని, బొగ్గు సరఫరా లోపం వల్ల దానికి నష్టం జరగడానికి వీల్లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా, పోలీసు అధికారులు, పోర్టు యాజమాన్యంతో పాటు రెగ్యులర్‌, నిర్వాసిత కార్మికులు అందరికీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నిర్వాసిత కార్మికుల తరపున సిఐటీయూ కూడా ఈ కేసులో మరో పిటిషన్‌ వేయడంతో అందరికీ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో నాలుగో తేదీ నుంచి కార్మికులు విధులకు హాజరవుతామని సీఐటీయూ తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులతో పోర్టు యాజమాన్యం చర్చించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది.