జనవరిలో 'మన శంకరవరప్రసాద్', 'అనగనగా ఒక రాజు' వంటి చిత్రాల విజయంతో టాలీవుడ్ ఉత్సాహంగా ఉంది. ఫిబ్రవరి తొలి వారంలో ఏకంగా పదికి పైగా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న 'యుఫోరియా' పైనే అందరి కళ్లూ ఉన్నాయి. భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సామాజిక చిత్రం యువతను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. దీనితో పాటు 'హనీ', 'సుమతీ శతకం', 'శ్రీ చిదంబరం గారు', 'చాయ్ వాలా' వంటి చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే రామ్ చరణ్ 'ఆరెంజ్' రీ-రిలీజ్ ద్వారా మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందనుంది. ప్రేమికుల వారంలో 'ఫంకీ' జోష్ వాలంటైన్స్ డే వీక్ (రెండో వారం) ప్రేమికులను అలరించేందుకు రొమాంటిక్ కామెడీలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 13న మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న 'ఫంకీ' థియేటర్లలోకి రానుంది. టీజర్ నుంచి పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' కూడా అదే సమయంలో విడుదల కాబోతోంది. వీటితో పాటు 'లవ్ స్టోరీ', 'మనసంతా నువ్వే' వంటి క్లాసిక్ లవ్ స్టోరీల రీ-రిలీజులు ఉండటంతో ప్రేమికుల రోజున బాక్సాఫీస్ వద్ద రొమాంటిక్ సినిమాల హడావుడి కనిపిస్తోంది. నవ్వులు పూయించేందుకు సిద్ధమైన సుహాస్ ఫిబ్రవరి మూడో వారంలో (ఫిబ్రవరి 20) 'హే భగవాన్' ప్రేక్షకులను పలకరించనుంది. శివాని నాగారం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో సుహాస్ తన హిట్ స్ట్రీక్ కొనసాగిస్తాడని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. నెల ఆఖరి వారంలో 'స్క్రీమ్' అనే చిత్రం షెడ్యూల్ కాగా, మృణాల్ ఠాకూర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' కూడా ఇదే నెలలో రానుంది. మొత్తానికి 20కి పైగా చిత్రాలు వరుసలో ఉన్నప్పటికీ, విశ్వక్ సేన్, సుహాస్ సినిమాలే ప్రస్తుతానికి ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Share