నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న యువ కెప్టెన్ భరత్ భరద్వాజ్, తన గ్రాడ్యుయేషన్ డే (పాసింగ్ అవుట్ పరేడ్) వేడుకల్లో భాగంగా ఆర్మీ హెలికాప్టర్ ముందు మోకాళ్లపై కూర్చుని తన స్నేహితురాలికి రింగ్ తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆమె సిగ్గుపడుతూ ‘యస్’ చెప్పడంతో అక్కడున్న వారంతా చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వినూత్న ప్రపోజల్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఆర్మీ అధికారులు మాత్రం భరత్ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిలిటరీ నిబంధనల ప్రకారం పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ఒక సైనికుడి వృత్తిపరమైన మైలురాయిని సూచించే అత్యంత అధికారిక, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఇటువంటి ఆర్మీ వేడుకల్లో కఠినమైన క్రమశిక్షణను పాటించాల్సి ఉంటుంది. అయితే కెప్టెన్ భరత్ ఒక అధికారిక సైనిక కార్యక్రమాన్ని, ఆర్మీ ఆస్తులను తన వ్యక్తిగత వేడుకల కోసం వాడుకోవడం డిఫెన్స్ టెక్నికల్ పబ్లిసిటీ రూల్స్‌తో పాటు, సైనిక వేడుకల అంతర్గత ప్రోటోకాల్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యను తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ, సైనిక నిబంధనల ఉల్లంఘన కింద కెప్టెన్ భరత్ భరద్వాజ్‌కు త్వరలోనే షోకాజ్ నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు ఆర్మీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిబంధనల ప్రకారం అతడిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.