కోల్‌కతాలో నిర్వహించిన భారీ విద్యార్థుల నిరసన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన కార్టూన్ ఉన్న పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలపై ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖా మిత్రాపై పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోల్‌కతాలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో నటి శ్రీలేఖ కూడా పాల్గొని ప్రధానిపై ఉన్న ఆ అభ్యంతరకర పోస్టర్‌ను చేతిలో పట్టుకుని నడిచారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ నాయకురాలు కేయా ఘోష్ కోల్‌కతాలోని ఆనందపూర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీలేఖా మిత్రాపై తొలి ఫిర్యాదు దాఖలు చేశారు. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిని పబ్లిక్‌గా అవమానించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం సహించరానిదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. అనంతరం బిధాన్‌నగర్ సైబర్ క్రైమ్ స్టేషన్ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై నటి శ్రీలేఖా మిత్రా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. విద్యార్థులకు, యువతకు మద్దతు తెలిపేందుకే తాను ఆ నిరసనలో పాల్గొన్నానని, ఆ సమయంలో తాను చదువుకునే కళ్లజోడు ధరించకపోవడం వల్ల ఆ పోస్టర్‌లో ఏముందో సరిగ్గా చూడలేకపోయానని పేర్కొన్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్న తొక్కిసలాట వాతావరణంలో ఎవరో చేతికి పోస్టర్ ఇవ్వగా తొందరపాటులో ఫొటో దిగానని, ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు.