Current Date: 31 Mar, 2025

చంద్రబాబు వ్యక్తిత్వంపై నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆయన వ్యక్తిత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్‌ను స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ..చంద్రబాబుతో తనకు వివాహం జరిగినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారని, పెళ్లయిన తర్వాత కూడా ఆయనకు కుటుంబం రెండో ప్రాధాన్యతగా ఉండేదని ఆమె అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తుంటే, తాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తామిద్దరం ప్రజలకు దగ్గరగా ఉంటున్నామని ఆమె చెప్పారు. ప్రజల సంతోషమే తమ ఆనందమని ఆమె అన్నారు. చంద్రబాబు తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకుంటారని భువనేశ్వరి అన్నారు. ఆయనకు ఎవరి మీదా వ్యక్తిగత కక్ష ఉండదని, ఆ రోజు జరిగిన ఘటనలను ఆ రోజే మరచిపోయి రేపటి గురించి ఆలోచించే మనస్తత్వం ఆయనదని అన్నారు.

Share