తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేసింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే అధికారంలోకి రావడానికి మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, 5 సీట్లు కలిగిన కాంగ్రెస్ మద్దతు తెలపడం విజయ్‌కు పెద్ద ఊరటనిచ్చింది. అయితే, ఈ మద్దతుకు సంబంధించి కాంగ్రెస్ కొన్ని కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది. తమకు రెండు క్యాబినెట్ మంత్రి పదవులతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా పార్టీ నేతలు విజయ్ ముందు ఉంచినట్లు సమాచారం. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనైయూర్‌లోని టీవీకే కార్యాలయంలో విజయ్‌తో భేటీ కానున్నారు. కేవలం కాంగ్రెస్‌తోనే సరిపోకుండా, మేజిక్ ఫిగర్ అందుకోవడానికి వీసీకే, సీపీఐ వంటి ఇతర పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతోంది. అన్నీ అనుకూలిస్తే, ఈనెల 7న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.