Current Date: 19 Aug, 2026

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందుకు హీరోయిన్ నిధి అగర్వాల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో సినీనటి నిధి అగర్వాల్ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు గానూ ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. సెలబ్రిటీలకు జరిగిన చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలతో పాటు అక్రమ మనీలాండరింగ్ కోణంలో ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రకటనల ద్వారా ప్రజలను బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టేలా ప్రోత్సహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్లతో పాటు మొత్తం 29 మందిపై దర్యాప్తు కొనసాగుతోంది.  అయితే, తాము కేవలం చట్టబద్ధమైన 'స్కిల్-బేస్డ్' గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ప్రమోట్ చేశామని, అక్రమ యాప్‌లకు ప్రచారం చేయలేదని గతంలో పలువురు సెలబ్రిటీలు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నిధి అగర్వాల్ ప్రచార ఒప్పందాలు, ఆమెకు అందిన పారితోషికం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించడం ఈడీ విచారణలో కీలకంగా మారనుంది.