ఏడు జన్మల బంధమంటూ అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసి ఒకటైన ఓ నవదంపతులు, వివాహమైన కేవలం వారం రోజుల్లోనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగుచూసింది. అత్తవారింట్లో అడుగుపెట్టిన తొలి రోజే తనకు ఈ ఇల్లు నచ్చలేదని నవవధువు తెగేసి చెప్పింది. అంతేకాకుండా, తాను ఇప్పటికే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేకనే ఈ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చిందని స్పష్టం చేయడంతో అత్తింటివారు అవాక్కయ్యారు. నవవధువు వ్యాఖ్యలతో షాక్‌కు గురైన భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాహ బంధాన్ని తక్షణమే రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పెళ్లి జరిగిన 7 రోజులకే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం, ఇరు వర్గాల మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో కోర్టు కూడా త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించింది. సాధారణంగా విడాకుల కేసుల్లో కౌన్సెలింగ్, సుదీర్ఘ విచారణల ప్రక్రియ పూర్తవ్వడానికి నెలల తరబడి సమయం పడుతుంటుంది. అయితే ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులను, ఇరుపక్షాల వాదనలను గమనించిన ఇండోర్ ఫ్యామిలీ కోర్టు అత్యంత వేగంగా స్పందించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే విచారణను పూర్తి చేసి, సదరు జంటకు విడాకులు మంజూరు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.