మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’ శుక్రవారం రిలీజైంది. ఈ మూవీ కథ ఏంటంటే.. చెక్క భజన ప్రదర్శనలు ఇచ్చే కనకరాజు (వరుణ్ తేజ్) శరీరంలోకి కొరియా నుంచి వచ్చిన ఒక వస్తువు ద్వారా వినూత్న రీతిలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని ప్రవర్తన భయంకరంగా మారడం, ఆ ఆత్మ కోరికలను తీర్చడం కోసం కొరియా వెళ్లాల్సి రావడంతో సినిమా ఆసక్తిగా సాగుతుంది. పూర్తిస్థాయి వినోదమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకుడు మేర్లపాక గాంధీ హాస్య సన్నివేశాలను బలంగా రాసుకోవడంలో సఫలమయ్యారు. వరుణ్ తేజ్ రెండు విభిన్నమైన కోణాలున్న కనకరాజు పాత్రలో కొత్త లుక్, మెరుగైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక కనకరాజు స్నేహితుడిగా నటించిన సత్య ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సత్య పంచ్‌లు, ఇతర హీరోల అనుకరణలు, మురళీధర్ గౌడ్‌తో సాగే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయించాయి. కథానాయికగా రితికా నాయక్, విలన్‌గా సునీల్ తమ పాత్రల పరిధి మేర నటించగా, థమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. కథ పరంగా కొన్ని చోట్ల లాజిక్‌కు అందని సన్నివేశాలు ఉన్నప్పటికీ, నిరంతర హాస్యంతో ప్రేక్షకులు వాటి గురించి ఆలోచించే సమయం లేకుండా దర్శకుడు కథనాన్ని వేగంగా నడిపించారు. పతాక సన్నివేశాల్లో ఆత్మలు తలపడే ఎపిసోడ్లు కాస్త బలవంతంగా అనిపించినా.. ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేడు. అయితే వినోదం కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఓవరాల్‌గా భిన్నమైన హారర్ కామెడీ కథాంశంతో వచ్చి, థియేటర్లలో నవ్వులు పూయించడంలో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.