టాలీవుడ్ చిత్రాల్లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో భాషా భేదం లేకుండా ఇతర భాషల నటులు మన సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సీనియర్ నటుడు జయరామ్ 'భాగమతి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ తర్వాత 'అల వైకుంఠపురములో', 'ధమాకా', 'గుంటూరు కారం' వంటి హిట్ సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అయితే, ప్రారంభంలో ఆయనకు తెలుగు డైలాగులు పలకడం పెద్ద సవాలుగా మారింది. జయరామ్ తాజాగా ఒక మలయాళ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'అల వైకుంఠపురములో' షూటింగ్ సమయంలో తనకు తెలుగు సరిగ్గా రాక, ఎన్నిసార్లు చదివినా డైలాగులు గుర్తుండలేదట. దీంతో ఆయన ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. డైలాగులను ఒక కాగితంపై రాసి, తన ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అతికించి, వాటిని చూస్తూ సీన్ పూర్తి చేసేశారట. సాధారణంగా నటులు డైలాగులు గుర్తుండకపోతే ప్రాంప్టింగ్ తీసుకోవడం లేదా నంబర్లు చెప్పడం వంటివి చేస్తుంటారు. కానీ ఏకంగా తోటి స్టార్ హీరోపైనే డైలాగ్ పేపర్లు అంటించి నటించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బన్నీ సహకారం, జయరామ్ సమయస్ఫూర్తిని చూసి నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. భాష తెలియకపోయినా తనదైన నటనతో జయరామ్ తెలుగులో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ సపోర్టింగ్ యాక్టర్‌గా కొనసాగుతున్నారు.
Share