Current Date: 24 Feb, 2026

మైనర్‌ కొడుకు కారు ఇచ్చిన తండ్రికి 3 ఏళ్ల జైలు శిక్ష.. జరిమానా కూడా!

జమ్మూకశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో మైనర్ కుమారుడికి కారు ఇచ్చినందుకు ఒక తండ్రికి కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఎస్‌.ఎం.హెచ్‌.రజ్వీ అనే వ్యక్తి తన మైనర్ కొడుకుకు వాహనాన్ని ఇవ్వగా, ఆ బాలుడు డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసును విచారించిన శ్రీనగర్ ట్రాఫిక్ కోర్టు న్యాయమూర్తి షాబిర్ అహ్మద్ మాలిక్, మోటారు వాహన చట్టం-1988లోని సెక్షన్ 199-ఏ ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తూ రజ్వీకి మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించారు. శిక్షతో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేయాలని, సదరు బాలుడికి 25 ఏళ్లు వచ్చే వరకు లెర్నింగ్ లైసెన్స్ జారీ చేయకూడదని మోటారు వాహన శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే తల్లిదండ్రులకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. అయితే, నిందితుడికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడంతో కోర్టు కొంత వెసులుబాటు కల్పించింది. 'ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్' కింద రూ. 2 లక్షల బాండ్‌ను సమర్పించి జైలు శిక్ష నుండి తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చని తెలిపింది.