పవన్ కల్యాణ్ సినిమా అంటే హీరోయిన్లకు ఒకప్పుడు గోల్డెన్ ఛాన్స్. ఆయన పక్కన నటిస్తే కెరీర్ మలుపు తిరుగుతుందని, అవకాశాలు క్యూ కడతాయని అంతా భావిస్తారు. అందుకే కథ కూడా వినకుండా సైన్ చేసేందుకు సిద్ధపడతారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ సరసన నటించిన భామలకు అదృష్టం ఏమాత్రం కలిసిరావడం లేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, హీరోయిన్ల కెరీర్‌కు మాత్రం పవన్ క్రేజ్ పెద్దగా ప్లస్ అవ్వడం లేదనే చర్చ నడుస్తోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటించిన శ్రీలీల, రాశి ఖన్నా ఆశలు అడియాశలయ్యాయి. వరుస ప్లాపుల్లో ఉన్న శ్రీలీల ఈ సినిమాతోనైనా ఫామ్ లోకి వద్దామని ఆశపడగా, రాశి ఖన్నా కనీసం క్రేజ్ అయినా వస్తుందని భావించింది. అయితే ఈ చిత్రం వారిద్దరికీ తెలుగులో ఆశించిన మైలేజ్ ఇవ్వలేకపోయింది. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన 'ఓజీ' సినిమా కూడా హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు కొత్తగా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఇక నిధి అగర్వాల్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి కాల్షీట్లు కేటాయించి, వేరే సినిమాలకు కమిట్ అవ్వకుండా పవన్ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోదామనుకున్న ఆమె కలలు వీరమల్లుతో నెరవేరలేదు.
Share