పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదాలు చిలికి చిలికి గాలివానలా మారి ప్రస్తుతం యుద్ధ వాతావరణానికి దారితీశాయి. అఫ్గాన్ దళాలు తమ సరిహద్దు పోస్టులపై దాడులు చేయడంతో ఆగ్రహించిన పాకిస్థాన్, తాజాగా ఆ దేశంలోని కాబూల్, కందహార్ వంటి కీలక నగరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "మా సహనం నశించింది, ఇకపై ఇది మీకూ మాకూ మధ్య బహిరంగ యుద్ధమే" అని సంచలన ప్రకటన చేశారు. ఈ ఉద్రిక్తతలు ఫిబ్రవరి 26, 27 తేదీల్లో తీవ్రరూపం దాల్చాయి. అఫ్గాన్ దళాల దాడిలో తమ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో, పాక్ సైన్యం 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' పేరుతో ప్రతీకార చర్యలు చేపట్టింది. ఈ దాడుల్లో అఫ్గాన్‌లోని తాలిబన్ సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించినట్లు పాక్ సమాచార శాఖ వెల్లడించింది. మరోవైపు, అఫ్గాన్ ప్రభుత్వం కూడా తాము పలు పాక్ సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించడంతో పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన మారింది. గత కొన్నాళ్లుగా సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాకిస్థాన్ తన అంతర్గత భద్రతకు అఫ్గాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులే కారణమని ఆరోపిస్తుండగా, తాలిబన్ ప్రభుత్వం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. తాజాగా ఖవాజా ఆసిఫ్ చేసిన 'ఓపెన్ వార్' ప్రకటనతో దక్షిణ ఆసియాలో ప్రాంతీయ సుస్థిరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.