Current Date: 28 Feb, 2026

కొడవ పద్ధతిలో విజయ్, రష్మిక పెళ్లి.. మాంసం, మద్యం తప్పనిసరి!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా గురువారం ఉదయం 10:10 గంటలకు వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేయగా, రష్మిక కుటుంబ మూలాలను గౌరవిస్తూ అదే రోజు సాయంత్రం కొడవ (కూర్గ్) పద్ధతిలో మరోసారి ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. రష్మికది కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం కావడంతో, ఈ వివాహ వేడుక అత్యంత ప్రత్యేకంగా సాగనుంది. సాధారణ హిందూ వివాహాల్లో ఉండే పురోహితులు, అగ్ని సాక్షి (హోమం) వంటివి లేకుండా, కేవలం ప్రకృతి సాక్షిగా, పెద్దల సమక్షంలో ఈ 'మంగళ' కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకలో వరుడు సంప్రదాయ 'కుప్య', 'పీచే కత్తి' ధరించగా, వధువు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా ప్రత్యేకమైన కొడవ చీరలో మెరిసిపోనుంది. కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో కొన్ని ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. వరుడు తన పరాక్రమానికి ప్రతీకగా అరటి చెట్టు కాండాలను నరకడం, పెళ్లి తర్వాత వధువు తన సహనాన్ని నిరూపించుకుంటూ బావి నుంచి నీటిని తోడి తెచ్చే 'గంగా పూజ' వంటివి ఈ వివాహంలో హైలైట్‌గా నిలవనున్నాయి. అలాగే ఇతర పెళ్లిళ్లకు భిన్నంగా కొడవ వివాహ విందులో మాంసాహారం, మద్యం తప్పనిసరిగా వడ్డించడం వారి సంస్కృతిలో భాగం.