Current Date: 08 Nov, 2024

భారత్ ఓటమితో టార్గెట్‌గా మారిన కోచ్ గంభీర్.. 24 ఏళ్ల తర్వాత వైట్‌వాష్

భారత్ గడ్డపై 12 ఏళ్లుగా టెస్టు సిరీస్‌లో పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర సాగించిన టీమిండియా వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. కానీ న్యూజిలాండ్‌ జట్టు చెలరేగి టీమిండియాను నేలకు దించింది. మెరుగైన వ్యూహాలకు, మెరికల్లాంటి ప్లేయర్లు తోడైతే భారత్‌ను భారత్‌లో ఓడించడం పెద్ద కష్టం కాదని కివీస్‌ ప్లేయర్లు నిరూపించారు. ఇన్నాళ్లు భారత ప్లేయర్ల ప్రధాన బలమనుకున్న స్పిన్‌తోనే టీమిండియాను ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ బోల్తా కొట్టించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లున్న టీమిండియా నాసిరకం ఆటతీరుతో ఉసూరుమనిపించింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. 2000 తర్వాత భారత్ గడ్డపై ఇలా టీమిండియా వైట్‌వాష్‌కి గురవడం ఇదే తొలిసారి. ఆదివారం కేవలం 147 పరుగుల టార్గెట్‌ని ఛేదించలేక టీమిండియా చతికిలపడిపోవడం గమనార్హం. దాంతో హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌‌పై విమర్శలు పెరిగిపోయాయి. కోచ్‌గా అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

Share