Current Date: 26 Nov, 2024

టీచర్ ఉద్యోగం వచ్చిన 23 రోజుల్లోనే సస్పెండ్.. మిస్టేక్‌గా ఇచ్చారట!

తెలంగాణలో విచిత్రంగా డీఎస్సీ 2024లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఎంపికల్లో గందరగోళం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో అర్హత లేని ఏడుగురిని ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులిచ్చారు. ఎస్జీటీ తెలుగు మాధ్యమంలో 257వ ర్యాంకు అభ్యర్థి ఉట్నుర్‌ లావణ్యకు నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. గత నెల 16న బాధ్యతలు చేపట్టిన ఆమె శనివారం వరకు(23 రోజులు) విధులకు హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 125వ ర్యాంకు అభ్యర్థి భార్గవి గైర్హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని, దీనిని సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామని తెలిపారు.

Share