అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మార్చి 6న జరగనున్న అల్లు శిరీష్-నయనికల వివాహ వేడుకల సందర్భంగా అల్లు అర్జున్ తన నివాసంలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్-ఉపాసన దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ఈ మద్యం పార్టీకి హాజరవ్వడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో వివాదం నెలకొంది. ఈ విమర్శలపై అల్లు శిరీష్ స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. అసలు పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ తమకు శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. చరణ్ కేవలం హాల్ వరకే పరిమితమయ్యారని, అక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదని పేర్కొన్నారు. చరణ్ వెళ్ళిపోయిన తర్వాతే పార్టీ మొదలైందని చెబుతూ, నెటిజన్ల తప్పుడు ప్రచారానికి అల్లు శిరీష్ చెక్ పెట్టారు. అయ్యప్ప మాల పట్ల రామ్ చరణ్‌కు ఉన్న భక్తిశ్రద్ధల గురించి శిరీష్ కొనియాడారు. మాలలో ఉన్నప్పుడు బయట కనీసం నీళ్లు కూడా తాగని నిష్ఠ చరణ్ సొంతమని ఆయన గుర్తుచేశారు. గత 20 ఏళ్లుగా చరణ్ క్రమం తప్పకుండా అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాలలు ధరిస్తూ ఏడాదిలో సుమారు 100 రోజులకు పైగా భక్తి మార్గంలోనే గడుపుతుంటారని, ఆయన క్రమశిక్షణ గురించి తెలియకుండా కామెంట్లు చేయడం సరికాదని నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.