టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న రూమర్లను నిజం చేస్తూ, రెండు రోజుల క్రితమే తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ గురువారం వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి సందడి మొదలవగా, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. విజయ్ ఇంటికి కోడలిగా రాబోతున్న రష్మిక గురించి గతంలో ఆయన తల్లిదండ్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'గీత గోవిందం' సినిమా వేడుకలో విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ.. తన కొడుకును అమితంగా ప్రేమిస్తూ, అతడిని బాగా అర్థం చేసుకునే అమ్మాయి కోడలిగా వస్తే చాలు అని కోరుకున్నారు. తండ్రి గోవర్ధన్ సైతం కులమతాల పట్టింపు లేదని, దక్షిణాదికి చెందిన అమ్మాయిని విజయ్ ఇష్టపడితే తమకు పూర్తి సమ్మతమని అప్పుడే స్పష్టం చేశారు. రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయి కావడం, విజయ్ కుటుంబంతో ఆమెకు మొదటి నుంచీ మంచి అనుబంధం ఉండటం విశేషం. మరోవైపు విజయ్ కూడా తనకు నచ్చిన, తన తల్లిదండ్రులను మెప్పించే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గతంలో కండిషన్ పెట్టారు. రష్మిక సైతం విజయ్ తల్లిని తన సొంత తల్లిలా భావిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇలా పెద్దలు పెట్టిన నిబంధనలకు, విజయ్ ఇష్టానికి తగ్గట్టుగానే రష్మిక వారి ఇంటి కోడలిగా వెళ్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.