ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముహూర్తం, వేదిక ఖరారైంది. తొలుత ఈ మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే తాజాగా వేదికను జెడ్డా నగరానికి మార్చారు. ఫ్రాంచైజీ ప్రముఖులకు వసతి ఏర్పాట్లను అబేది అల్ జోహార్ అరీనా సమీపంలో గల హోటల్ షాంగ్రీ-లాలో సిద్దం చేసినట్లు తెలుస్తుంది. వేలం తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరుగనుంది. వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే కావడం విశేషం. ఈ సారి మెగా వేలానికి మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లని రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. ఇందులో నుంచి కేవలం 204 మంది ఆటగాళ్లని మాత్రమే వేలంలో కొనుగోలు చేయనున్నారు.