Current Date: 26 Nov, 2024

ఐపీఎల్ 2024లో ముంబయి లేటుగా బోణి.. బౌలర్ చలవే!

ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఈసారి ఆలస్యంగా గెలుపు బోణి అందుకుంది. అది కూడా ఓ బౌలర్ లాస్ట్ ఓవర్‌లో 32 పరుగులు చేసి ఆ జట్టును గట్టున పడేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబయి టీమ్ ఢిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. టీమ్‌లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా 230 పైచిలుకు పరుగులు ఓ జట్టు చేయడం ఐపీఎల్‌లో సరికొత్త రికార్డ్. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్‌లో రొమారియో షెఫర్డ్ వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదేసి 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ టీమ్ 205/8కే పరిమితమైంది. ఒకవేళ షెఫర్డ్ లాస్ట్‌ ఓవర్‌లో ఆ పరుగులు చేయకుంటే ఈ మ్యాచ్‌లోనూ ముంబయి ఓడిపోయేది.

సీజన్ ఆరంభం నుంచి ముంబయి వరుస వివాదాల్లో ఉంది. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని తప్పించి హార్దిక్‌కు ఇవ్వడంతో మొదలైన రగడ ఆ జట్టు ప్రదర్శనని కూడా దెబ్బతీసింది. అయితే.. ఎట్టకేలకి టీమ్‌లో సర్దుబాట్లు జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టులో సమష్టితత్వం కనిపించింది.