Current Date: 12 Jun, 2026

ఈరోజు నుంచి మహిళల టి20 ప్రపంచకప్‌..ఫస్ట్ మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ

ఒకవైపు సాకర్‌ ఫీవర్ నడుస్తుంటే, మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్‌ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న ఈ పదో మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. 7 వేదికల్లో 33 మ్యాచ్‌ల పాటు సాగే ఈ క్రీడా పండుగ, వచ్చే నెల 5న లార్డ్స్‌ మైదానంలో జరిగే ఫైనల్‌తో ముగియనుంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన తొమ్మిది వరల్డ్‌కప్‌లలో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు టైటిల్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఏడో కప్పుపై కన్నేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్‌ జట్లు తమ రెండో టైటిల్‌ కోసం నిరీక్షిస్తున్నాయి. గత రెండు పర్యాయాలు (2023, 2024) ఫైనల్‌కు చేరి తృటిలో ట్రోఫీని చేజార్చుకున్న దక్షిణాఫ్రికా... ఈసారైనా బలమైన బృందంతో కప్పును ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు, గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ చేజిక్కించుకొని జోరుమీదున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... టి20 ఫార్మాట్‌లోనూ తొలిసారి విశ్వ విజేతగా నిలిచి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని తహతహలాడుతోంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) అనుభవంతో రాటుదేలిన భారత అమ్మాయిలు దూకుడే మంత్రంగా బరిలోకి దిగుతున్నారు. కాగా, భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.