దక్షిణ థాయ్‌లాండ్‌లోని సాంగ్‌ఖ్లా ప్రావిన్సులో ఒక టీనేజరు (17) ఘోర కలికలం సృష్టించాడు. పబ్లిక్ స్కూలు వద్ద గొడవ చేస్తున్నాడన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసు అధికారిపై దాడి చేసి, అతడి తుపాకీని లాక్కున్నాడు. అనంతరం ఆ తుపాకీతో స్కూలు లోపలికి చొరబడి సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరుపుతూ హంగామా సృష్టించాడు. ఈ దుశ్చర్యలో దురదృష్టవశాత్తు స్కూలు డైరెక్టరు మరణించగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారుల ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు యువకుడు గత కొంతకాలంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడని, పైగా అతడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
Share