Current Date: 15 Feb, 2026

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. చతికిలపడ్డ బీఆర్‌ఎస్

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం ఏడు కార్పొరేషన్లకు గాను ఆరింటిని చేజిక్కించుకోవడమే కాకుండా, 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల స్పష్టమైన మెజారిటీ సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన, మంత్రుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ విజయానికి ప్రధాన కారణమైంది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు దాదాపు 52 శాతం వార్డులను గెలుచుకుని హస్తం పార్టీ పీఠాధిపత్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తింది. కార్పొరేషన్లలో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయిన ఆ పార్టీ, కేవలం 13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. దాదాపు 27 శాతం మున్సిపల్ వార్డుల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ, గతంతో పోలిస్తే ప్రచారంలో వెనకబడటం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో గులాబీ శ్రేణులు డీలా పడ్డాయి. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10 స్థానాలకు గాను 8 గెలిచి సంచలనం సృష్టించడం గమనార్హం. బీజేపీకి ఈ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు దక్కాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కేవలం 10 శాతం వార్డులకే పరిమితమైంది. నిజామాబాద్‌లో సత్తా చాటినా కాంగ్రెస్-ఎంఐఎం పొత్తు వల్ల అక్కడ కమలానికి అవకాశం తక్కువగా కనిపిస్తోంది. మొత్తం 37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడగా, ఈ నెల 16న జరిగే తుది లెక్కింపుతో ఏ పార్టీకి ఎన్ని మున్సిపల్ పీఠాలు దక్కుతాయనే అంశంపై పూర్తి స్పష్టత రానుంది.